19-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, జనవరి 19: దేశమంతా అయోధ్య రామ మందిర ప్రారంభ వేడుక చేసుకుంటోందని |బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 22న రామమందిరం ప్రారంభోత్సవానికి అనేక రాష్ట్రాలు సెలవులు ప్రకటించారని... కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రకటించకపోవడం శోచనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో హిందువుల మనోభావాలు కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్ కు ఉందన్నారు. 22న తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రెండు నెలల తర్వాత వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి జగన్కు 17 సీట్లు కూడా రావని.. వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
జగన్ రాష్ట్రంలో ప్రజల నుంచి దోచుకున్న సొత్తుతో ఎన్నికలకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ ఏరులై పారుతోందన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్కు వినతిపత్రం సమర్పించామన్నారు. 2024 సాధారణ ఎన్నికలలో 110 స్థానాల్లో తిరుపతి తరహా కుట్రకు జగన్ సిద్ధంగా ఉన్నారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.