19-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 19: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహా కొడాలి నాని వంటి వారు కూడా వచ్చే ఎన్నికల తరవాత కనుమరుగై పోతారని వైసీపీపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రానున్నది టిడిపి ప్రభుత్వం అని, రాక్షస ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి, సజ్జల ఆదేశించారని తప్పులు చేసే అధికారులకు ఐఏఎస్ అధికారి గిరీశాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఎన్నికల అనంతరం జగన్ రెడ్డి దేశం విడిచి పోతారని.. అతన్ని నమ్ముకొని తప్పులు చేసే అధికారులు ఎక్కడికి పోతారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పాలన ఉండేది కేవలం 83 రోజులే అని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత ఆదుకుంటాం.... రక్షిస్తామన్న ఏ నాయకుడు కనిపించడనే వాస్తవం అధికారులు గ్రహిస్తే మంచిదని ఆయన హితవుపలికారు. తిరుపతి ఉపఎన్నికలో ఆర్వోగా నాడు చేసిన తప్పులకు, నేడు కలెక్టర్గా ఉన్న గిరీశా సస్పెండ్ అయ్యారన్నారు. అతనితో పాటు మంత్రిపెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను కూడా ఎన్నికల సంఘం శిక్షించాలని డిమాండ్ చేశారు.
మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వెంటనే విచారణ చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామన్నారు. గిరీశాను సస్పెండ్ చేసినట్టే ప్రతాపరెడ్డి, రిష్వంత్ రెడ్డి, హరినారాయణ, పరమేశ్వర్ రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు.
ఎవరి ఆదేశాలతో దొంగ ఓట్లు సృష్టిస్తున్నారో, అర్హుల ఓట్లు తొలగిస్తున్నారో, ఇష్టానుసారం ఫామ్-7లు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నా రో అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు తప్పులు చేస్తున్న అధికా రులపై ఫిర్యాదు చేస్తూనే ఉంటామన్నారు. సీఐలు, డీఎస్పీలు, ఆర్డీవోలు, ఎస్పీలు, కలెక్టర్లుగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని టీడీపీ నేత హెచ్చరించారు.
కొడాలి నానీ వేస్ట్ ఫెలో అని.. అహంకారపు పొరలు కమ్మి టీడీపీ సభకు వచ్చిన జనం నానీకి కనిపించడం లేదని మండిపడ్డారు. రా.. కదలిరా సభకు వచ్చిన లక్షమందికి పైగా జనాన్ని చూసి కొడాలినానీ ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారన్నారు. 83 రోజుల తర్వాత జగన్ రెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి సహా ఎవరూ కనిపించరని బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.