19-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 19: కోనసీమ జిల్లాలో వైకాపాకు గట్టి షాక్ తగిలింది. అమలాపురానికి చెందిన వైకాపా యువజన నాయుడు, శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ తెదేపాలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో శనివారం 5వేల మందితో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. వైకాపాకు రాజీనామా చేసినట్టు ఇప్పటికే సుభాష్ ప్రకటించారు.
మంత్రి విశ్వరూప్, మరికొంత మంది సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెట్టారని.. అలాంటి వారికి టికెట్ ఇవ్వొద్దని అగ్రనాయకత్వానికి చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్ల కేసులో తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అమాయకులపై కేసులు ఎత్తివేయాలని కోరగా వైకాపా జిల్లా అధ్యక్షుడు, స్థానిక నేతలు అడ్డుపడ్డారని ఆరోపించారు.