19-01-2024 RJ
తెలంగాణ
మహబూబ్ నగర్, జనవరి 19: రాముడి పేరుతో రాజకీయాలు చేయడం బీజేపీ ఆపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నవాబుపేట మండలం కొల్లూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. రాముడు అందరివాడని.. దేవుడి ఫొటోతో రాజకీయం చేయడం బీజేపీకి తగదన్నారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవాన్ని పీఠాధిపతులే వ్యతిరేకించా రని తామెంత అన్నారు. రాములవారి అక్షింతల పేరుతో కొంతమంది బియ్యం సంచులు ఇచ్చి అయోధ్య అక్షింతలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ప్రజల తిరస్కరణకు గురైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు అహంకార పూరితంగా మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వద్దంటూ హైకోర్టులో పిల్ వేశారని.. ఒకవేళ వారు ఉచిత బస్ సౌకర్యం వద్దనుకుంటే టికెట్ తీసుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శ్రీరాముడు అందరివాడని, కొందరి వాడు అన్నట్లుగా బీజేపీ ప్రచారం చేయడం సరికాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. పవిత్ర కార్యాన్ని రాజకీయాలకు వాడుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేయడమేంటని ప్రశ్నించారు.
ధార్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొల్లూరులో ఏర్పాటు చేసిన శ్రీచింతలపురి చిన్మయ స్వామి మఠం రజతోత్సవ వేడుకల ప్రారంభోత్సోవానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుడిని కొలిస్తేనే ఆయన శక్తియుక్తులు కలిగిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గం అనుసరిస్తే ముక్తి ప్రాప్తిస్తుందని తెలిపారు.
కొల్లూరులో చిన్మయస్వామి మఠాధిపతి శ్రీనందీశ్వర స్వామి పెద్ద ఎత్తున రజతోత్సవాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్ర పీఠాధిపతి 1008వ జగద్గురు శివాచార్య మహాస్వాములు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తిభావంతో నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాజేష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.