19-01-2024 RJ
తెలంగాణ
కోరుట్ల, జనవరి 19: జగిత్యాల జిల్లా కోరుట్లలో శుక్రవారం హైదరాబాద్ సీఐడీ అధికారులు పలువురు పాస్ పోర్టు ఏజెంట్ల ఇళ్లపై దాడులు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు కోరుట్లకు చేరుకున్న సీఐడీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక పోలీసుల సాయంతో ముగ్గురు పాస్ పోర్ట్ ఏజెంట్ల ఇళ్లలో సోదాలు చేశారు.
హైదరాబాద్ లోని సీఐడీ కార్యాలయంలో కోరుట్లకు చెందిన ముగ్గురు పాస్ పోర్టు ఏజెంట్లపై నమోదైన కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా అధికారులు వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు సోదాల్లో పలు నకిలీ పాస్ పోర్టు, పాస్ పోర్ట్ మార్ఫింగ్ కు సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
పట్టణానికి చెందిన ముగ్గురు పాస్ పోర్టు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాల్లో సీఐడీ డీఎస్పీలు నందిరామ్, సంపత్, వెంకటేశ్వర్లు, రవీందర్, పది మంది సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.