19-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 19: అయోధ్యను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత జాతికి ప్రతిపక్ష పార్టీలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 22న సగం రోజు సెలవు ప్రకటించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజల మనోభావాలను తెలుసుకోవాలన్నారు. 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవప్రదంగా అయోధ్య రాముడికి పంపించే కానుకలను సిద్ధం చేయాలని బీజేపీ నేత సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్కు ఎందుకు పోతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. అదానీ, అంబానీలను తిడుతూ మరోవైపు ఆయనతోనే మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారని... ప్రజలందరూ ఈ అంశాన్ని గమనించాలన్నారు. గతంలో కేటీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పిన రూ. 20వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఏమయ్యాయని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు.