19-01-2024 RJ
తెలంగాణ
కరీంనగర్, జనవరి 19: ఈనెల 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర పునఃప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఆరోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు.
అనంతరం సంజయ్ చీపురు, పార బట్టి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపిలుపు మేరకు దేవాలయాలను శుద్ధి చేస్తున్నామన్నారు. అన్నివర్గాల ప్రజలు దేవుడి అక్షితల కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొంటున్నారని చెప్పారు. రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు.
అయోధ్య అక్షితలు రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా? 'అక్షితల్లో రేషన్ బియ్యం, బాసుమతి బియ్యం, జై శ్రీరాం బియ్యం అనే రకాలు ఉండవు. పవిత్రమైన దేవుడి అక్షితలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు వక్రీకరించడం తగదు. కాంగ్రెస్ నేతలు కోరితే బాసుమతి బియ్యాన్ని పంపించేందుకు సిద్ధంగా ఉన్నాం' అని పేర్కొన్నారు.