19-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జనవరి 19: పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని.. ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో మాట్లాడుతూ, పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? అంటూ ప్రశ్నించారు.
పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోవడం అంటరానితనమే. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే. పేదపిల్లలకు ట్యాబ్లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమే. దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమలేదు. మన ప్రభుత్వం బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదు. అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదని సీఎం జగన్ దుయ్యబట్టారు.
పెత్తందారులకు దళితులంటే చులకన. పెత్తందారీ పార్టీలకు, పెత్తందారి నేతలకు పేదలు అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రాజధాని కోసం పేదల భూములు లాక్కున్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే పెత్తందారుల లక్ష్యం. గతంలో చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కలేకపోయారు. చంద్రబాబు ఎందుకు సామాజిక న్యాయం అమలు చేయలేకపోయారని అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని, అలాగే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తుకు వస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరణం లేని మహానీయుడు విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
మన అడుగుల్లో, మన బతుకుల్లో, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాడని అన్నారు. దేశంలో కుల అహంకారం మీద, పెత్తందారీ వ్యవస్థ మీద, వ్యవస్థల దుర్మార్గలపై పోరాటాలకు అంబేద్కర్ స్ఫూర్తినిస్తూనే ఉంటాడని అన్నారు. ఈ విగ్రహం చూసినపుడల్లా... పేదలు, మహిళల హక్కులు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.
అంబేద్కర్ సమసమాజ భావాలకు నిలువెత్తు రూపమన్నారు. గొంతు వినిపించలేని అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడానికి కారణం అంబేద్కరేనని జగన్ అన్నారు. అణుగారిన వర్గాలకు ఈ విగ్రహం శక్తినిస్తుందని, అండగా నిలుస్తుందన్నారు. ఎంతమందిని రాజ్యసభకు పంపితే అందులో సగం మంది ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నారని సీఎం జగన్ తెలిపారు.
13 జిల్లాల జడ్పీ చైర్మన్లలో బలహీన వర్గాలకు చెందిన 9 మందికి పదవులు ఇచ్చామన్నారు. ఇలాంటి సామాజిక న్యాయం, మన ప్రభుత్వం తప్పా... ఎక్కడైనా చూశారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదని, దళితులంటే చంద్రబాబుకు నచ్చరని అన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అని జగన్ విమర్శించారు. పెత్తందారి పార్టీలకు, పెత్తందారి నేతలకు పేదల సంక్షేమం పట్టదన్నారు.
పేదలకు అండగా ఉండాలని... ఈ పెత్తందారి పార్టీలకు ఎందుకు ఆలోచన రాదని ప్రశ్నించారు. దళితులకు చంద్రబాబు నాయుడు సెంటు భూమి ఇవ్వలేదని, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీని నిర్వీర్యం చేశారన్న సీఎం జగన్... పేదలు ఆత్మగౌరవంతో బతకొద్దని పెత్తందారులు కోరుకుంటున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవని, వివక్ష అసలే లేదని స్పష్టం చేశారు. అంటరానితనం రూపం మార్చుకుందన్న సీఎం జగన్... పేదలను దూరంగా ఉంచడం మాత్రమే అంటరాని తన కాదన్నారు.
పేదవారు ఇంగ్లీష్ మీడియం చదవొద్దని కోరుకోవడం కూడా అంటరాని తనమేనన్నారు. పేదలు తెలుగు మీడియంలోనే చదవాలని చెప్పడం వివక్ష కాదా అని జగన్ ప్రశ్నించారు. పేద కులాల వారు ఎప్పటికీ తమ సేవకులుగానే ఉండాలని కోరుకోవడం దుర్మార్గమన్నారు. పథకాల అమలులో కూడా వివక్ష చూపడం అంటరానితనమేనన్న జగన్... అంబేద్కర్ భావజాలం అంటే పెత్తందారులకు నచ్చదన్నారు.
సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి జగన్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తుకు వస్తుందని, ఇక నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఆంధప్రదేశ్ గుర్తుకు వస్తుందన్నారు.