20-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
వెంకటగిరి, జనవరి 19: తుగ్లక్ సిఎం జగన్ మోహన్ రెడ్డి వెయ్యి తప్పులు చేశారని, ఇంకా భర్తిస్తారా అని ఆంధ్రా ప్రజలను టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగారు. ఓటు అనే వజ్రాయుధంతో జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎపిలో ఏ వర్గం అయినా సంతోషంగా ఉందా అని ప్రశ్నించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, 82 రోజుల్లో ఈ వైసిపి ప్రభుత్వం దిగిపోనుందని చురకలంటించారు.
జీతం కోసం అడిగితే ఉద్యోగులు జైలు వెళ్లే దుస్థితి ఏర్పడిందని, జగన్ పోవాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని బాబు పిలుపునిచ్చారు. 25 ఏళ్ల క్రితం తాను యువతకు ఐటి అనే ఆయుధం ఇచ్చానని, ఇప్పుడు అది వజ్రాయుధమైందని ప్రశంసించారు. టిడిపి హయాంలో తిరుపతిని మొబైల్ హబ్గా తయారు చేశామని, రా కదిలిరా అని పిలుపు ఇస్తే వెంకటగిరి గర్జించిందని, వైసిపి వచ్చాక వెంకటగిరి తలరాత మారిందా? అని బాబు ప్రశ్నించారు. ఎపిలో రాజకీయ దృశ్యం మారిపోతుందన్నారు.
వైసిపిలో ఉండే ఆనం జగన్ పాలన బాగోలేదని చెప్పారని, అనం ప్రజాహితం కోసం మాట్లాడితే దూరం పెట్టేశారని దుయ్యబట్టారు. సీనియర్లను కూడా లెక్కపెట్టని అహంకారం జగన్ది అని మండిపడ్డారు. వెంకటగిరి 'రా...కదలిరా' బహిరంగ సభలో వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజకీయం మారుతుందని... ఏపీని రివర్స్ గేర్ లో నడిపించిన తుగ్లక్ పని అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు.
వైసీపీలో ఉండి, జగన్ పాలన బాగాలేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చెప్పారని.. అప్పటి నుంచి అనంని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశామన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా ఆనం పనిచేశారన్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తే దూరం పెట్టి పక్కన పెట్టారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఐదేళ్లు పోరాటం చేశారన్నారు. శిషుపాలుడు వంద తప్పులు చేస్తే, ఈ సైకో వెయ్యి తప్పులు చేశారని విమర్శించారు. 'మీ అందరి చేతుల్లో ఓటుంది.
ఇంటి పెద్ద సరిలేకుంటే, ఆ కుటుంబం బాగుంటుందా? ఏపీలో కూడా అదే జరిగింది. విధ్వంసం కొనసాగింది. సంక్రాంతి పండుగ కూడా చేసుకోలేకపోయాం. ఉద్యోగులకి జీతాలు పెంచే పరిస్థితి లేదు. అడిగితే జైలుకి పోతామనే భయం' అందరిలో ఉందని టీడీపీ అధినేత పేర్కొన్నారు. చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ... తుపానులు, వరదలు వచ్చినప్పుడు ఒక్కో కుటుంబానికి రూ.10వేలు ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఏ కులస్థులైనా బాగున్నారా? ఏ మతస్థులైనా బాగున్నారా? కనీసం రెడ్లు అయినా బాగున్నారా?.. దీనికి ఒక్కటే మార్గమని.. జగన్ పోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు.
యువత కోసం 25 ఏళ్ల కిందట ఐటీ అయుధం ఇస్తే, ఇప్పుడదే వజ్రాయుధం అయిందన్నారు. తిరుపతి, నెల్లూరు, చెన్నైని ఒక హబ్ గా చేద్దామని అనుకున్నామని... ప్రపంచంలోనే మేలైన ప్రాంతంగా చేయాలని చూశామన్నారు. ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్ గా చేద్దామని అనుకున్నామని తెలిపారు. మంచి పరిశ్రమలు, విద్యాసంస్థలు తీసుకువచ్చి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెద్దామని అనుకున్నామన్నారు. అయితే తెచ్చిన వాటిని ఏం చేశారో చూశామని.. రూ.16లక్షల కోట్లు పెట్టుబడులు టీడీపీ తెస్తే, జగన్ నిరుద్యోగం పెంచారని మండిపడ్డారు.
కియా వంటి పరిశ్రమలు తెస్తే, వాటికే కన్నం వేశాడీ.. జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఐటీ ఉద్యోగాలిస్తే, జగన్ వాలంటీర్ల ఉద్యోగాలు, బ్రాందీ షాపులో ఉద్యోగాలు, పిష్ మార్కెట్ ఉద్యోగాలిచ్చారని మండిపడ్డారు. టీడీపీ పరిశ్రమలు తెస్తే... జగన్ భంభం, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ తెచ్చారని.. హోల్ సేల్, రిటైల్ వ్యాపారమంతా ఆయనదే అని విరుచుకుపడ్డారు. జగన్ ఓ పెద్ద వ్యాపారి. మనల్ని అందర్నీ దోచుకున్నాడు. ఇసుక తైలం తీసి రూ.కోట్లు దోచాడు. తిరుపతిలో రూ.4వేల కోట్ల పీడీఆర్ బాండ్లు పేరుతో దోచారు. ఏపీ వ్యాప్తంగా రూ.24 వేల కోట్లు దోచారు. తిరుపతి ప్రాంతంలో ఎర్రచందనం ఉంది. ఆ రోజు స్మగ్లింగ్ చేసే వారిపై గట్టిగా చర్యలు తీసుకున్నాం.
ఈ రోజు ఒక్కరినైనా పట్టుకున్నారా? ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు. అయోధ్యలో రామాలయం నిర్మిస్తే దేశమంతా చూస్తుంది. తిరుమలలో స్వామి ఆలయాన్నీ దోచుకుంటున్నారు. ఆ దేవుడు క్షమించినా మనం క్షమించం అంటూ వ్యాఖ్యలు చేశారు. జగనన్న హౌసింగ్ కాలనీల్లో అవినీతే అవినీతి. రూ.15 లక్షలకి ఎకరా భూమి కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రూ.50కోట్లుకి అమ్మారు. కొండలు, గుట్టలు, చెరువులు అన్నీ మాయమయ్యాయి. రూ.4500 కోట్ల విలువ చేసే సిలికాని ఈ దుర్మార్గులు దోచేశారు. సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో క్వార్ట్ జ్ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు.
కేజీఎఫ్ త్రీగా మార్చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి నిరాహారదీక్షకి దిగి పోరాటం చేశారు. అది ప్రజా సంపద, ప్రజలందరి కోసం వినియోగించాలి. జగన్ 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టాడు. ఇసుకంతా దోచేశారు. మొన్న బీచ్ శ్యాండ్ను అమ్మాలని చూస్తే, కోర్టు ఆపింది. జగన్కు ఓడిపోతామనే భయం పట్టుకుంది. ప్రజలు గెలవాలి. జగన్ పోవాలని అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.