19-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, జనవరి 19: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో హైదరాబాద్ లోని తన నివాసంలో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే కొణతాల హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలు దేరి వెళ్లారు. విశాఖ ఎయిర్ పోర్టులో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ... తన శ్రేయోభిలాషులు, అభిమానులు చాలా కాలం నుంచి రాజకీయాలలోకి మళ్లీ రమ్మని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. వారి సూచనల మేరకు హైదరాబాద్ వెళ్లి పవన్ కళ్యాణ్ని కలిశానని తెలిపారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు సంబంధించి పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు చెప్పారు. అలాగే ఏపీలో ఉన్న అన్ని సమస్యలపై పవన్ కళ్యాణో చర్చించానని కొణతాల అన్నారు.
ఈ నెల 21వ తేదీన అనకాపల్లిలో తన అభిమానులతో సమావేశం అవుతున్నానని.. ఆ రోజే ఏ పార్టీలో చేరతానో స్పష్టం చేస్తానని అన్నారు. పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలనే నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ కు చెబుతానని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.