19-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 19: నా సమర్ధత గురించి కేశినేని నాని మాట్లాడటం హాస్యాస్పదం అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మెజారిటీ పెంచుకున్న తాను సమర్థుడినో, ఓట్ల శాతం తగ్గిన కేశినేని నాని సమర్థుడో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. రాజకీయంగా తెలుగుదేశం తనకు తల్లి లాంటిదన్నారు. విజయవాడ ను అభివృద్ధి చేసింది చంద్రబాబు అని అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో ప్రతి ఏటా రూ.300 కోట్లు విజయవాడ అభివృద్ధికి కేటాయించిందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి విజయవాడకు ఎంత బడ్జెట్ కేటాయించారో కేశినేని చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టకు డబ్బు ఇవ్వలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వానిది అని విమర్శించారు. కేశినేని నాని... అన్నీ తెలిసి కూడా పార్టీ మారిన తరువాత తెలుగుదేశంపై అబద్దాలు చెప్పడం దుర్మార్గమన్నారు. కేశినేని నాని వైసీపీలో చేరాక ఆ పార్టీ ఖాళీ అవుతోందని గద్దె రామ్మోహన్ రావు ఎద్దేవా చేశారు.