20-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 20: యావత్ ప్రపంచం అయోధ్య వైపు చూస్తోంది. హిందూ ప్రపంచం పండుగగా భావిస్తున్న అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని భాగ్యనగరం నడిబొడ్డన చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) నిర్ణయించింది. పరిషత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్, కార్యదర్శి సాయిరామ్ యాదవ్, ఉపాధ్యక్షులు అనిష్ గౌడ్, కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, కార్యదర్శి అశోక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
కార్యక్రమ వివరాలను పరిషత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్ వివరించారు. హిందూ ఐక్యత చాటేలా.. హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణ ధర్మపరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 22న హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహాం పక్కన, ప్రసాద్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ కార్యక్రమానికి నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. 22న మధ్నాహ్నం 4 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
శ్రీరామ్ పూజతో కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా భారీగా తరలి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అభిషేక్ గౌడ్ వివరించారు. భక్తులను పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిలిచిపోయేలా గణెష్, శ్రీరామ్, హనుమాన్ కీర్తనలు, పాటలతో భక్తిలహరి ఏర్పాటు చేసామని పేర్కొన్నారు.