20-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 20: ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో స్వర్ణకారులు, సూక్ష్మ కళాకారులు, నేత కార్మికులు తదితరులు తమతమ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. శ్రీరాముడు, సీతాదేవి, అయోధ్య రామాలయం ఇలా తమకు తోచిన నమూనాలను రూపొందిస్తూ రామయ్యపై భక్తిని చాటుకుంటున్నారు.
తాజాగా ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నెస్ రికార్డ్ హోల్డర్, డాక్టర్ గుర్రం దయాకర్ బియ్యం గింజలతో అయోధ్య రామాలయ నమూనాను రూపొందించారు. ఈ రామాలయ నమూనా రూపకల్పన కోసం డాక్టర్ దయాకర్ ఏకంగా 16 వేలకు పైగా బియ్యపు గింజలను వినియోగించారు.
ఈ కళాఖండాన్ని దయాకర్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయనున్నారు. ఈ కళాఖండం రూపకల్పనపై ఆయన మాట్లాడుతూ.. 'ప్రధాని మోదీ అకుంఠిత దీక్షవల్లనే ఇప్పుడు రామాలయ నిర్మాణం జరిగింది. ఇది భారతదేశానికి గర్వకారణం. సనాతన ధర్మం గొప్పతనం. ఈ సందర్భంగా ఒక సూక్ష్మ కళాకారుడిగా, రామ భక్తునిగా ఈ కళాఖండాన్ని రూపొందిం చాను అని తెలిపారు. 16 వేలకు పైగా బియ్యపు గింజలతో రూపొందించిన ఈ కళాఖండాన్ని ప్రధాని మోదీకి అందజేస్తా.
ఈ కళాఖండాన్ని తయారు చేయడానికి 60 గంటల సమయం పట్టింది. ఇంత అద్భుతమైన కళాఖండాన్ని ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు తయారు చేయలేదు. ఈ కళాఖండాన్ని రూపొందించడం నా అదృష్టంగా భావిస్తున్నా' అని డాక్టర్ దయాకర్ చెప్పారు.