20-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 20: అయోధ్య ప్రతిష్టాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఆలయాల శుభ్రత కొనసాగుతోంది. ఇప్పటికే బిజెపి నేతలు ఆలయాలను శుభ్రం చేశారు. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ తమిళసై ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు.
అనంతరం లక్ష్మణ సమేత సీతారాములను దర్శించుకున్నారు. నవగ్రహ ప్రదక్షిణ చేశారు. అలాగే పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయాన్ని కిషన్ రెడ్డి సతీమణి శుభ్రం చేశారు. చీపురుపట్టి ఆమె ఊడ్చారు. మోడీ వల్లనే ఇవాళ అయోధ్య ఆలయం సాకారం అయ్యిందని అన్నారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలో ఉన్న అన్ని ఆలయాను శుభ్రం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ అభియాన్ చేపట్టారు. అయోధ్యలో శ్రీరామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ అభ్యర్థించారు. జనవరి 22 నాటికి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను శుభ్రం చేయాలని, స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 12న మహారాష్ట్రలోని నాసిక్ లో పర్యటించిన ప్రధాని.. శ్రీ కాలారామ్ ఆలయాన్ని శుభ్రం చేసిన విషయం తెలిసిందే.