20-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అన్నమయ్య, జనవరి 20: అన్నమయ్య జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ పట్ల కారు డ్రైవర్, అతడి అనుచురులు అనుచితంగా ప్రవర్తించారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న కారును తీయాలని అన్నందుకు ఆర్టీసీ డ్రైవర్ పై కారు డ్రైవర్ దాడి చేశాడు. రాయచోటి శివారుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆర్టీసీ అమరావతి సర్వీసు బస్సు కడప నుంచి బెంగళూరుకు వెళ్తున్న సమయంలో రాయచోట శివారులో ఓ కారు రోడ్డుకు అడ్డంగా నిలిచి ఉండటాన్ని డ్రైవర్ గుర్తించాడు. దీంతో రోడ్డుపై అడ్డంగా ఉన్న కారును తీయాలని కారు డ్రైవర్ ను ఆర్టీసీ డ్రైవర్ కోరారు. ఈ విషయంపై మాటా మాటా పెరిగి ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో ఊగిపోయిన కారు డ్రైవర్, అతని అనుచరులు కలిసి ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదారు.
ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో అటెండర్క గాయాలయ్యాయి. దాడి అనంతరం కారు డ్రైవర్, అతని అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే స్థానికులు గాయపడిన ఆర్టీసీ డ్రైవర్, అటెండర్ను రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.