20-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అనంతపురం, జనవరి 20: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. ఉరవకొండలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
విగ్రహావిష్కరణ సందర్భంగా ఉరవకొండలో బీజేపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందే ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ ఆ రోజుల్లో తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలనే ఇవాల్టికీ అన్ని రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నాయన్నారు.
ఏ రాజకీయ పార్టీ అయినా ఇవాళ ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా రాజకీయాలు మాట్లడలేని పరిస్థితి ఏర్పడిందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పేర్కొన్నారు. కాగా.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. విగ్రహా ఆవిష్కరణలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంధిరెడ్డి శ్రీనివాసులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.