22-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జనవరి 22: అయోధ్యలో ఇప్పుడు నభూతో అన్నరీతిలో జరుగుతున్న రాంలల్లా ప్రతిష్ఠాపనకు, కృష్ణా జిల్లా పెదముత్తేవి శ్రీ లక్ష్మణ యతీంద్రులుకు సంబంధం వున్న వాస్తవం చాలా మందికి తెలియక పోవచ్చు. పెదముక్తేవి శ్రీశ్రీశ్రీ సీతారామ యతీంద్రులకు శ్రీ లక్ష్మణ యతీంద్రులు పిత్రుపాదులు... బాబ్రీ మసీదు విధ్వంసం నేపథ్యంలో 1992, డిసెంబర్ 6న బాలరాముడి విగ్రహాన్ని ప్రస్తుతం ప్రతిష్ఠ జరుగుతున్న స్థలంలో స్థాపించిన ఘనత లక్ష్మణుల వారిదే.
ఆనాటి కరసేవలో పాల్గొని మార్గదర్శనం చేసిన ప్రముఖ అగ్రశ్రేణి కరసేవకులు వారు. ఉత్తుంగ తరంగంలా ఎగిసిన నాటి కరసేవా ఉద్యమంలో వయసును సైతం లెక్కచేయకుండా పాల్గొని, ఆ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించి పరమపదం చేరుకున్నారు. శ్రీ రామచంద్ర ప్రభువు మరొక్కసారి మనకోసం, మనదైన అయోధ్యానగరిలో ఆవిర్భవించబోతున్న ఈ పవిత్ర సమయంలో ఆయన మనమధ్య ఇవాళ భౌతికంగా లేకపోవచ్చు.
కాని పరమపదం నుండి వారు ఈ దివ్యమైన, అద్వితీయమైన రామప్రతిష్ఠా ఘట్టాన్ని వారు ఆనందాతిశయంతో, పారవశ్యంతో తిలకిస్తూ వుండివుంటారు..! శ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులవంటి అసంఖ్యాక కరసేవకుల స్వప్న సాఫల్యానికి గుర్తుగా ఇవాళ అయోధ్యలో భవ్య రామమందిరం వెలుస్తోంది. ఈ శుభ సమయంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులను స్మరించుకోవడం చాలా ఆనందంగానూ, ఉద్వేగంగానూ వుంటుంది.