22-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 22: పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామన్నారు. కాంగ్రెస్ అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.
సోమవారం తెలంగాణ భవన్ లో నల్గొండ లోకసభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయన్నారు. తాము ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించు కోవాలన్నారు.
హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోందని.. అయినా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని మండిపడ్డారు. కార్యకర్తలు ఉదాసీన వైఖరి మీమాంస వీడాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు.. ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలని సూచించారు.
కోమటి రెడ్డి గత నవంబర్లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారన్నారు. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డికే పంపించాలన్నారు. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటి సారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించిందన్నారు.
కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాం సాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడిందన్నారు.
రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి మోడీ లేక బీఆర్ఎస్ ను కాలుస్తారట అంటూ వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ సోదరులకు కాంగ్రెస్ - బీజేపీ అక్రమ సంబంధం గురించి చెప్పాలన్నారు. అదానీని రాహుల్ దొంగ అన్నారని.. రేవంత్ దొర అంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలే పార్టీకి కథనాయకులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో నల్లగొండ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.