22-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 22: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ న్యాయ జోడో యాత్రపై అసోంలో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. అసోంలో అప్రతిహాతంగా సాగిపోతున్న భారత్ న్యాయ జోడో యాత్రపై అతివాద బీజేపీ గూండాల దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని ఆమె ఎక్స్లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో నిరాటంకంగా సాగిపోతున్న యాత్ర కోట్ల ప్రజల హృదయాలను కలుపుతూ, వారిని చైతన్య పరుస్తూ దూసుకుపోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని ఆమె ఎద్దేవా చేశారు.
అందుకే హేమంత్ బిస్వా అవినీతి, నిరంకుశ పాలనలో గత కొన్ని రోజులలుగా ఇటువంటి నీచ దుశ్చర్యలకు, కుట్రలకు బీజేపీ పదే పదే పాల్పడుతోందని ఆరోపించారు. ఈ తరహా చర్యలకు స్వస్తి పలకాలని ఆమె సూచించారు. రాహుల్ గాంధీ యాత్రపై చేసిన దాడికి నిరసన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం సాయంత్రంం రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లోని మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద భైఠాయించి మౌన దీక్షలు చేపట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. ఈ సిగ్గుమాలిన చర్యలకు నిరసనలతో తగిన బుద్ధి చెప్పాలని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోపాటు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టాలని అమె పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ జోడో యాత్రతో బీజేపీ అగ్ర నాయకులకు నిద్ర కరువైందనడానికి ఈ తరహా దాడులే నిదర్శనమని షర్మిల పేర్కొన్నారు. సిగ్గుమాలిన రెచ్చగొట్టే చర్యలను పురికొల్పడంలో ఆశ్చర్యం లేదని, దేశం ఐక్యత, ప్రజా శ్రేయస్సు కోసం చేసే ఈ పోరాటం బెదిరింపులకు లొంగదని షర్మిల స్పష్టం చేశారు. ఈ సిగ్గుమాలిన దాడులు తమ ధైర్యాన్ని, స్ఫూర్తిని దెబ్బతీయలేవని షర్మిల ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. అగ్ర నాయకుడు చేస్తున్న పాదయాత్రపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే షర్మిల స్పందించిన తీరు పట్ల ఆ పార్టీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదే అగ్రెసివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళితే బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అవతరించడం ఖాయంగా పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు.
షర్మిల నోటి నుంచి వస్తున్న పదునైన విమర్శలు పార్టీకి మైలేజ్ ను తీసుకువస్తాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే రాహుల్ గాంధీ పాదయాత్రపై దాడిని నిరసిస్తూ మౌనదీక్షలకు పిలుపునిచ్చిన షర్మిల.. తన పోరాటాన్ని ప్రారంభించారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.