22-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 22: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే మీరు ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎక్స్ వేదికగా కల్వకుంట్ల కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా..
అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా స్ఫూర్తిదాయక వీరులకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ కవిత ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో రాజకీయాల కోసం, సనీకుచిత మనస్తత్వంతో, ఈ మహా కార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నానని అన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే మహోన్నతుడు, అణగారిన ప్రజల్లో చైతన్యం నింపిన మహా మనిషి అని.. అందుకే ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుపునే కాకుండా.. యావత్ తెలంగాణ ప్రజల తరుపున వినమ్రంగా మరోసారి కోరుతున్నానని కవిత తెలిపారు.