22-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 22: ఏపీలో త్వరలో సాధారణ ఎన్నికలు ఉన్నందున పోలింగ్ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు, సిబ్బందిని ఈనెల 25వ తేదీ లోగా బదిలీ చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ, బదిలీలు తదితర అంశాలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా సహా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రానున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
అందుకు వీలుగా జిల్లాల్లో వచ్చే జూన్ నాటికి ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు సిబ్బంది అందరినీ జనవరి 25లోగా బదిలీ చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేయాల్సిన ర్యాంపులు, ఇతర సదుపాయాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా తదితర శాఖల అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ, బదిలీలు తదితర అంశాలపై అధికారులకు ఏపీ సీఎస్ పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణా నియంత్రణపై చర్చించారు. ఎన్నికల్లో పటిష్ట నిఘాకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ చెక్కు పోస్టుల ఏర్పాటును తక్షణం పూర్తి చేయాలని స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
ఇంకా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారులు (కలెక్టర్ కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని సిఇఓ, సిసిఎస్ఏ ను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ..
ఎన్నికల విధులతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడేళ్లుగా పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయాల్సిన వారిని గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని శాఖల్లో అధికారుల బదిలీ పక్రియ చేపట్టామని వెల్లడించారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, పోలీస్ శాఖల్లో బదిలీ చేయాల్సిన వారిని గుర్తించామని.. మూడు రోజుల్లో వారిని బదిలీ చేయాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సీఈఓ మీనా సూచించారు.
సీఎస్ నిర్వహించిన ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, అదనపు డిజిపి శాంతి భద్రతలు ఎస్.బాగ్చి, సిడిఎంఏ వివేక్ యాదవ్, సెబ్ డైరెక్టర్ ఎం.రవిప్రకాశ్, ఐజీ రవీంద్ర బాబు, అదనపు సీఈఓ కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, నిషాంతి తదితరులు పాల్గొన్నారు.