22-01-2024 RJ
తెలంగాణ
నల్లగొండ, జనవరి 22: తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత పాలకులు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లో 'అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
ఛత్తీస్ ఘడ్ కరెంట్ కొనుగోళ్లలో దోపిడీలు బయట పెడుతున్నాననే తనపై జగదీష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజిలెన్స్ విచారణ, సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ చేపడతామన్నారు కోమటి రెడ్డి. వాటి నివేదిక తర్వాత జగదీష్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎవ్వరు ఆపలేరంటూ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు పోయే రెండో వ్యక్తి జగదీశ్ రెడ్డి అని కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఆడించే జోకర్ జగదీష్ రెడ్డి అని ఘాటుగా స్పందించారు. మద్యనిషేధంలో అక్రమంగా మందు అమ్మి జైలుకు పోయిన జగదీష్ రెడ్డి మాట్లాడటం విడ్డురం అంటూ విమర్శలు గుప్పించారు. వేల కోట్ల ఆస్తులు ఫామ్ హౌస్లు ఎట్లొచ్చాయని నిలదీశారు. వీటన్నింటిపై తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. జగదీశ్ రెడ్డి మర్డర్ కేసులో నిందితుడని ఆరోపించారు.