23-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేట, జనవరి 23: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి, తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారని, గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో పార్లమెంట్ కు పంపించారని అన్నారు.
గడిచిన నాలుగున్నారేళ్లలో నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషిచేశానని చెప్పారు. ప్రజలు గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. వైసీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని, దానికి నేను బాధ్యుడిని కాదని శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి వైసీపీ అధిష్టానం కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తోందని తెలిసిందని.. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.