23-01-2024 RJ
తెలంగాణ
నల్లగొండ, జనవరి 23: ఉమ్మడి నల్లగొండ బీఆర్ఎస్ లో మెల్లగా ముసలం పుడుతోంది. మొన్నటి ఎన్నికల్లో సూర్యాపేట నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి ఓక్కరే గెలుపొందారు. దీంతో ఆయన ఇతర నేతలపై పెత్తనం చెలాయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మండలి ఛైర్మన్ గుత్తా సుకేందర్ రెడ్డి తీరుపైనా ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు సమస్య రాజుకుంది. ఆయన వల్లనే పార్టీ ఓడిందని వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై గుత్తా కూడా గట్టిగానే సమాధానం ఇవ్వాలని అనుకున్నారు. అయితే కెటిఆర్ వెంటనే రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి తానే కారణమైతే ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో ఓటమికి ఎవరు కారణమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో గాలి వచ్చింది.. పార్టీ ఓడిపోయిందన్నారు. అభివృద్ధి చేసిన మంత్రులు కూడా ఓడిపోయారని చెప్పారు. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎంపీ సీట్లతో పాటు నల్గొండ సీటు విషయంలో కూడా టఫ్ ఫైట్ ఉందన్నారు గుత్తా.
పార్టీ అవకాశం ఇస్తే తన కొడుకు అమిత్ భువనగిరి లేదా నల్లగొండ సీటు నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని చెప్పారు. దీనిపై మరో మూడు నాలుగు రోజుల తర్వాత అధిష్టానం క్లారిటీ వస్తుందన్నారు. ఇదే విషయాన్ని కెటిఆర్ కు సూచించానని అన్నారు. కాంగ్రెస్ కు తాను దగ్గరయ్యేది ఉంటే బీఆర్ఎస్ నుంచి తన కొడుక్కి టికెట్ ఎందుకు అడుగుతానని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. తనపై కొందరు కావాలని బురద వేసే ప్రయత్నంలో ఉన్నారని పరోక్షంగా జగదీశ్ రెడ్డిపై మండిపడ్డారు.
తాను పార్టీ వీడుతానని ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. ఇకపోతే కృష్ణా ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళ్తే తెలంగాణకు గొడ్డలి పెట్టు లాంటిదని అభిప్రాయపడ్డారు. సాగు, తాగు నీళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్ ల పరిధిలోకి పోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. ఉప ఎన్నికలు కాబట్టి ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు వేరువేరుగా జరిగాయన్నారు. బిఆర్ఎస్ బలంగానే ఉందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని గుత్తా చెప్పారు.