23-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 23: రానున్న సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఈనెల 25వ తేదీ నుంచి రాష్ట్రస్థాయిలో కార్యకర్తల సమావేశాలు ప్రారంభించనుంది. సంస్థాగతంగా కార్యకర్తలను ఉత్తేజపర్చేందుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా ఆఫీస్ బేరర్ల మీటింగ్ లో పాల్గొననున్నారు. వీటిలో భాగంగా తొలి సమావేశం తెలంగాణలో జరగనుంది.
ఇటీవలే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎల్బీ స్టేడియంలో జరిగే బూత్ వర్ మీటింగ్ లో ఖర్గే పాల్గొంటారు. జనవరి 28వ తేదీన ఉత్తరాఖండ్, 29న ఒడిస్సా, ఫిబ్రవరి 3న దిల్లీ, 4న కేరళ, 10న హిమాచల్ ప్రదేశ్, 11న పంజాబ్, 13న తమిళనాడు, 15న ఝార్ఖండ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కేడర్ తో ఖర్గే సమావేశమవుతారని తెలిపారు.
వచ్చే ఎన్నికలకు వారిని సమాయత్తం చేస్తారన్నారు. ఇటీవల జనవరి 4వ తేదీన జరిగిన ఓ సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ రేయింబవళ్లూ శ్రమించి 2024లో ప్రజలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విభేదాలను పక్కన పెట్టాలని, మీడియాలో పార్టీ అంతర్గత విషయాలను ప్రస్తావించవద్దని ఆయన శ్రేణులకు సూచించారు.