24-01-2024 RJ
సినీ స్క్రీన్
నటి లావణ్య త్రిపాఠి వెల్లడి అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సోమవారం శోభాయమానంగా జరిగింది. ఈ సందర్భంగా మెగా కోడలు లావణ్య త్రిపాఠీ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. అయోధ్యలో పుట్టిన ఆమె ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. రాముని జన్మస్థలమైన అయోధ్యలో పుట్టిన నేను ప్రాణ ప్రతిష్ట వేడుకను తిలకించటం అదృష్టంగా భావిస్తున్నాను.
నాతో సహా భారతీయులందరికీ ఇది గర్వించదగ్గ విషయం. ఈ పండగ వాతావరణంలో నేను రామ్ పరివార్ జ్యువెలరీ ధరించడం సంతోషంగా ఉంది. విగ్రహ ప్రాణప్రతిష్ట కేవలం అయోధ్యలోనే కాదు దేశమంతా ప్రాధాన్యత సంతరించుకుంది. దేశమంతా ఏకతాటిపైకి వచ్చి రాముడి రాకను సంబరాలు చేసుకుంటోంది. ఇది మనందరినీ ఏకం చేసే ఉత్సవం. ఇది మనలో ఐకమత్యాన్ని, అన్ని వర్గాలవారూ ఒక్కటే అన్న భావాన్ని పెంపొందిస్తుంది.
మనసులో అపార భక్తిని నింపుకుందాం.. అయోధ్యలోనే కాకుండా దేశమంతా శాంతియుతంగా ఉండాలని కోరుకుందాం.. జై శ్రీరామ్' అని తన పోస్ట్ లో పేర్కొంది మెగా కోడలు లావణ్యా త్రిపాఠీ. ఈ పోస్టు చీరకట్టులో ఉన్న ఫోటోను జత చేసింది. శ్రీరామపట్టాభిషేకాన్ని సూచిస్తున్నట్లుగా ఉన్న రామ్ పరివార్ ఆభరణం ఆకట్టుకుంది. ఆ ఆభరణాన్ని ధరించి అయోధ్య రామాలయ ప్రారంభ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంది లావణ్య త్రిపాఠీ.