24-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 24: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో భేటీ అయ్యారు. లండన్లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు సీఎం అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు.
ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్లో హైదరాబాద్ లో మూసీ నదిని పునరుజ్జీవింప జేసేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, థేమ్స్ నది తరహాలో అభివృద్ధి, తదితర అంశాలను ఆయనతో చర్చించారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు.
పర్యావరణాన్ని కాపాడుతూ, సహజ వనరులకు విఘాతం లేకుండా మూసీ నదిని అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. కాగా, రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, ఎకో టూరిజానికి తమ సహకారం ఉంటుందని ఎల్లిస్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, డిప్యూటీ హై కమిషనర్ గారేత్ వైన్ ఒవేన్, తదితరులు పాల్గొన్నారు.