24-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 24: చేవెళ్ల పంచాయతీ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనను ఫోనులో దుర్భాషలాడిన ఎంపి రంజిత్ రెడ్డిపై మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సర్పంచులుతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ రంజిత్ రెడ్డి తనతో అసభ్యంగా మాట్లాడారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
ఈ నెల 20న బంజారాహిల్స్ పోలీసులకు కొండా ఫిర్యాదు చేశారు. ఎంపీ రంజిత్రెడ్డి ఫోన్లో తనను దూషించాడని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని కొండా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు సమయంలో తనను బెదిరించిన వ్యక్తి ఎవరనేది విశ్వేశ్వర్ రెడ్డి మీడియాకు వెల్లడించలేదు. పోలీసులకు ఆయన పేరు చెప్పినట్టు వివరించారు. సంస్కారం లేని వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు.
అతని పేరు చెప్పడానికి కూడా తన మనసు అంగీకరించడం లేదని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తులను తాను పట్టించుకోనని.. కానీ పార్టీ పెద్దల సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కొండా తెలిపారు. తన మనుషులను ఎలా కలుస్తారని కొండాకు ఫోన్ చేసి ఎంపీ రంజిత్ ప్రశ్నించారు. దీంతో.. దమ్ము ధైర్యం ఉంటే తన వాళ్లను తీసుకువెళ్లు అని కొండా దీటుగా కౌంటర్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే.. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి.. బండ బూతుల దాకా వెళ్లింది. ఇక ఇదే విషయమై పోలీసులకు కొండా ఫిర్యాదు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరిపి, కోర్టు అనుమతి తీసుకొని ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.