25-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 24: అధికార పార్టీ వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేయగా.. మరికొందరు కూడా అదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైపీపీ అధిష్టానం అప్రమత్తం అయ్యింది. అసంతృప్త నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందుకోసం సీఎం జగన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. అసంతృప్త నేతలతో సీఎం చర్చించాలని నిర్ణయించినట్లు తెలిస్తోంది. ఈ క్రమంలో వైసీపీని వీడేందుకు యత్నిస్తున్న అసంతృప్త నేతలకు తాడేపల్లి నుంచి పిలుపువచ్చింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన ఎమ్మెల్యేలను సీఎం జగన్ తాడేపల్లికి పిలిపిస్తూ వారితో చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అధిష్టానం పిలుపు మేరకు సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సీఎంవోకు వచ్చారు.
ఇటీవల సంతనూతల పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబును పార్టీ ఇంచార్జి నుంచి సీఎం తప్పించిన విషయం తెలిసిందే. మంత్రి మేరుగ నాగార్జునను సంతనూతలపాడు పార్టీ ఇంచార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో సుధాకర్ బాబుకు ముఖ్యమంత్రి జగన్ టికెట్ నిరాకరించారు. వైసీపీ అధిష్టానం నిర్ణయంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీని వీడే యోచనలో సుధాకర్ బాబు ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాడేపల్లికి పిలిపించిన సీఎం జగన్.. ఆయనతో చర్చలు జరుపునున్నారు. అయితే సీఎం జగన్ తో చర్చల అనంతరం ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.