25-01-2024 RJ
సినీ స్క్రీన్
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా వున్నారు. ఇంతకు ముందు 'మిస్టర్ ప్రగ్నెంట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోహెల్, ఆ సినిమాతో తన ప్రతిభని చూపించాడు. అటు క్రిటిక్స్, ఇటు ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఇప్పుడు 'బూట్ కట్ బాలరాజు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సోహెల్. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ విడుదల వేడుకలో సోహెల్ బాగా ఎమోషనల్ అయ్యాడు.
సినిమాలు, వెబ్ సిరీస్, రియాలిటీ షో, షార్ట్ ఫిలిం ఇలా ఏది చేసినా గుర్తింపు కోసం చేస్తాం, బతకడానికి చేస్తాం. 'నేను పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ఓ షార్ట్ ఫిలిం లో నటించాను. తరువాత 'కొత్త బంగారు లోకం' సినిమాలో చిన్న పాత్ర చేసాను, ఆలా చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాను', అని అన్నాడు సోహెల్. ఇలా తన గురించి చెపుతూ సంక్రాంతి పండగ నాడు ఒక హీరో కి ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేసాడు, 'నేను సోహెల్' అనగానే ఫోన్ పెట్టేసాడు అని చెప్పి బాధపడ్డాడు సోహెల్. వాళ్లంతా పెద్ద హీరోలు, కానీ వెంకటేష్ గారికి ఒక మెసేజ్ పెడితే వెంటనే నాకు అల్ ది బెస్ట్ చెప్తూ సమాధానం ఇచ్చారు, వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. నాకు చాలా ఆనందం వేసింది.
అందరూ ఒకేలా వుండరు అని, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, తనలాంటి వాళ్లు అడిగినప్పుడు ఒక మాట సాయం చేస్తే చాలు అని సోహెల్ బాధపడుతూ చెప్పాడు. ఈ సినిమాలో సోహెల్ పక్కన మేఘలేఖ కథానాయకురాలిగా నటిస్తోంది. ఇంకా ఇందులో ఇంద్రజ, అనన్య నగెళ్ల, సునీల్, ముక్కు అవినాష్, రోహిణి మున్నగువారు వున్నారు. శ్రీ కోనేటి దర్శకుడు ఈ సినిమాకి, కాగా ఈ సినిమాతో సోహెల్ నిర్మాతగా కూడా మారాడు. భీమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఫిబ్రవరి 2న విడుదలవుతోంది.