25-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 25: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ల ఎంపికకు ఆమె ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరామ్, సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
దీంతో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను గవర్నర్ ఆమోదించారు. వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. వీరి నియామకానికి గవర్నర్ ఆమోదం తెలుపగా.. గవర్నర్ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, మరొకరి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ తిరస్కరించారు. దాంతో ఆ రెండు స్థానాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు పేర్లను ప్రతిపాదించగా.. గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు.