26-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 26: దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల తాగ్యఫలం వల్లే ఈ రోజు మనం స్వేచ్చగా బ్రతకగలగుతున్నామని అన్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం తనకు ఎంతో ప్రత్యేకమైనదని, పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారన్నారు. 2006లో తనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చినప్పుడు అదే ఎంతో గొప్ప విషయంగా భావించానని, ఇప్పుడు పద్మవిభూషణ్ ఇస్తారని ఊహించలేదన్నారు. ఈ పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చిరంజీవి చెప్పారు.
కాగా రాజకీయాల్లో.. సినిమాల్లో.. ఇలా రెండు వేర్వేరు రంగాల్లో ఎలాంటి నేపథ్యమూ లేకుండా అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి, తమ స్వయంకృషితో, అద్భుత ప్రతిభతో అత్యున్నత స్థానాలకు ఎదిగిన ఇద్దరు అసామాన్యులైన తెలుగు తేజాలను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కాగా.. మరొకరు తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్గా వెలుగొందుతున్న చిరంజీవి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2024కుగాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తనను పద్మవిభూషణ్ కు ఎంపిక చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్ (ట్విటర్) వేదికగా శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు.
పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. మనదేశంలో రెండో అత్యన్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లికడుపున పుట్టకపోయినా, నన్ను తమ సొంతమనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం అండదండలు, నీడలా నాతో ప్రతినిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. నాకు దక్కినటువంటి ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.
నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. నిజజీవితంలో కూడా నా చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నాను. కానీ నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతిక్షణం గుర్తుకువస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చిరంజీవి పేర్కొన్నారు.