26-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీరుపై భారతీయ జనతా పార్టీ విమర్శించింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉన్నట్టే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో చింతా సాంబమూర్తి, కాశం వెంకటేశ్వర్లు, బండా కార్తీక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ముందు చూపుతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా దేశంలో మోదీ పాలన సాగుతుంది. కాంగ్రెస్ హయాంలో మాత్రం దళారి పాలన కొనసాగింది.
తెలంగాణ రాష్ట్రంలో గ్యారెంటీ, ఉచితాల పేర్లతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. పేదలకు శాశ్వత ప్రయోజనం కల్పించాలనే చిత్తశుద్ధి ఆ పార్టీకి లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను బీజేపీ చేసి చూపించింది.
33 శాతం మహిళ రేజర్వేషన్లు, అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది. తెలుగు తేజాలకు పద్మ భూషణ్, పద్మవిభూషణ్ అవార్డు వరించడంలో ఎవరి సిఫారసు లేదు. యాభై రోజుల రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్టు అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని' లక్ష్మణ్ సీఎం రేవంత్ పాలనను విమర్శించారు.