26-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 26: అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా ఇరు పార్టీలపై విరుచుకుపడ్డారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం వ్యవహారంపై స్పందిస్తూ.. కాంగ్రెస్, బీజేపీల రహస్యమైత్రి మరోసారి బయటపడిందన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలు అయిందన్నారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ నిరాకరించారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారన్నారు. ఇది ద్వంద్వ నీతి కాదా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా? గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్యా సామాజిక, సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారని అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయన్నారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమన్నారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలని.. కానీ బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు తేడా చూపిస్తున్నారని హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.