26-01-2024 RJ
తెలంగాణ
ములుగు, జనవరి 26: గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకోవాలని భావించిన యువకులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించిన విషాద ఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఎస్సీకాలనీలోని శివాలయం సమీపంలో ప్రతియేట మాదిరిగా ఈసారి కూడా గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జెండాతో కూడిన ఇనుప స్థంభాన్ని పైకి లేపుతుండగా కరెంటు తీగలకు స్థంభం తగిలి విద్యుదాఘాతానికి గురై బోడ అంజిత్(36), ల్యాడ విజయ్(26) అనే ఇద్దరు ఎస్సీ యువకులు ఘటన స్థలంలో మృతి చెందారు.
చక్రి అనే మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, విచారం వ్యక్తం చేశారు. తక్షణ సహాయం కింద రెండు కుటుంబాలకు రూ. 10,000 చొప్పున అందించారు. విద్యుత్ శాఖ తరుఫున ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.