26-01-2024 RJ
తెలంగాణ
జనగామ, జనవరి 26: గవర్నర్ తమిళిసై, రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిని అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ వేడుకల వేదికను రాజకీయ వేదికగా మల్చుకొని గవర్నర్ మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు.
గత ప్రభుత్వం గురించి అనేక విషయాలను మాట్లాడుతూ.. ఆ ప్రభుత్వంలో వ్యవస్థలు నాశనం అయ్యాయని, యువత ఉద్యోగ అవకాశాల కల్పన కోల్పోయిందని అనడం హాస్యాస్పదమని కడియం అన్నారు. గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా.. ఆమె ప్రభుత్వమేనని.. అప్పుడు ఇప్పుడు గవర్నర్ తమిళ సై ఉన్నారని కడియం అన్నారు.
ఏ ప్రభుత్వం తప్పు చేసినా గవర్నర్ బాధ్యత వహించాల్సింది పోయి గత ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పడం కంటే గవర్నర్ తమిళపై గత ప్రభుత్వం చేసిన తప్పుకు బాధ్యత వహించాలని కడియం అన్నారు. తమిళసై బీజేపీ ప్రతినిధిగా మాట్లాడటాన్ని బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తుందని కడియం చెప్పారు.
రాష్ట్రపతి, గవర్నర్ రాజ్యాంగ బద్ధమైన పోస్టులని ఏది పడితే అది మాట్లాడకూడదని ఆయన అన్నారు. గత పదేళ్లు పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని తమిళిసై అన్నారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించరన్నారు. ఈ వ్యాఖ్యలపై కడియం తీవ్రంగా స్పందించారు.