26-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జనవరి 26: గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం నాడు విజయవాడలోని రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అతిథ్యమిచ్చారు. ఈ అధికారిక కార్యక్రమానికి సీఎం జగన్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు జోగి రమేశ్, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, కొంతమంది వైసీపీ కీలక నేతలు హాజరయ్యారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కాంగ్రెస్ సీనియర్ నేత గిడుగు రుద్రరాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గైర్హాజరయ్యారు. అయితే పార్టీ తరఫున గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. తన సోదరుడు వైఎస్ జగన్ రాకతో చెల్లి షర్మిల హాజరుకాలేదనే టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో అయితే చిత్ర విచిత్రాలుగా కామెంట్ల వర్షం కురుస్తోంది. మరోవైపు..
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఏపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారిగా ఏర్పాటు చేసిన 'ఎట్ హోం' కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. వైజాగ్ పర్యటనలో ఉండడంతో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.