27-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 27: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా కెసిఆర్ గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ ఛాంబర్ లో ఆయన ప్రమాణం చేస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వెల్ నుంచి ఎన్నికయ్యారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు కాస్త కోలుకోవడంతో అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఫిబ్రవరి 1వ తేదీన మంచిరోజు కావడంతో.. అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్.. కామారెడ్డి, గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, కామారెడ్డిలో అనూహ్యంగా ఆయన ఓటమిపాలయ్యారు. గజ్వేల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం చెందగా.. కాంగ్రెస్ విజయఢంకా మోగించింది.
దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి.. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఓటమి నేపథ్యంలో నాటి సీఎం కేసీఆర్ తన రాజీనామా లేఖను నేరుగా గవర్నర్ కు పంపించి.. అక్కడి నుంచి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్కు వెళ్లారు. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి కేసీఆర్ ఇంట్లో కాలు జారి కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయన తుంటి ఎముక విరిగిపోయింది. యశోద ఆస్పత్రిలో చేర్పించగా.. శస్త్రచికిత్స చేసి తుంటి ఎముక రీప్లేస్ చేశారు.
8 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించగా.. కేసీఆర్ బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు కాస్త కోలుకోవడంతో ప్రజా క్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండటంతో.. ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ముందుగా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.