27-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 27: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించి, అంచనాలు తయారు చేయాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు తులం బంగారం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రూ. లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికను అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన పూర్తి బడ్జెట్ ను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేద్దామని తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట సొంత భవనాలు నిర్మించేందుకు భూమిని గుర్తించాలన్నారు. సొంత భవనాలు నిర్మించేందుకు అంచనా వ్యయాన్ని రూపొందించాలని సూచించారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ ను రూపొందించాలని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక యూనిట్గా బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు అంశంపై పూర్తి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.