27-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి, జనవరి 27: మంత్రి పెద్దిరెడ్డికి లంచం లేనిదే ముద్ద దిగదని... పీలేరులో 'రా.. కదలిరా’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క మంచి మంత్రి కూడా లేడని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పదవుల కోసం సొంత కార్యకర్తల నుంచే లంచం తీసుకుంటున్న మంత్రి ఒకడు ఉన్నాడని, అతడే పెద్దిరెడ్డి అని ఆరోపణలు చేశారు.
ఈ పాపాల పెద్దిరెడ్డి అన్నంకి బదులు ఇసుకే తినేటట్లు ఉన్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉదయం ఇసుక, మధ్యాహ్నం మైన్స్, రాత్రి ఇరిగేషన్ ప్రాజెక్టులు.. ఇలా అన్నింటిలోనూ ఆ మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడున్న బకాసురుడ్ని ఈ పాపాల పెద్దిరెడ్డి మించిపోయాడని నిప్పులు చెరిగారు. తన దయాదాక్షిణ్యాల వల్లే పెద్దిరెడ్డి ఇప్పటివరకూ గెలిచాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక శిఖండి నాయకుడిలా అవతరించాడని.. అసలు అతను ఒక నాయకుడేనా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించినందుకు గాను 600 మంది పైన తప్పుడు కేసులు పెట్టించాడని.. అందులో విద్యార్థులతో పాటు ముసలివాళ్లు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాపాల పెద్దిరెడ్డి పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేడని దుయ్యబట్టారు.
ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డికి అధికారం ఉండదని.. చేసిన తప్పులకి అతడ్ని శిక్షించే బాధ్యత తనదేనని మాటిచ్చారు. సైకోని నమ్ముకుని చేసిన అరాచకాలకు సమాధానం చెప్పక తప్పదన్నారు. టీడీపీ అంటే ఏంటో, తానంటే ఏంటో చేసి చూపిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. అంతకుముందు.. సీఎం జగన్ రెడ్డికి కూడా చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వైసీపీకి ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే లేరని, కానీ జనం సిద్ధం అంటూ జగన్ చెప్తున్నారని అన్నారు. జగన్ ఎంత సిద్ధమయ్యాడో తెలీదు కానీ.. అతడ్ని ఓడించడానికి జనం సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు. జగన్.. నిన్ను ఇంటికి పంపడానికి అన్నదాతలు, నిన్ను తరిమి కొట్టడానికి యువత, నీ అహంకారాన్ని అణచివేయడానికి ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసారి వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని.. ఈ యుద్ధానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ఛాలెంజ్ చేశారు.