27-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 27: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన రెరా కార్యదర్శి, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాల గుట్టును ఏసీబీ రట్టు చేస్తోంది. ఇందుకు సంబంధించిన 45 పేజీల రిమాండ్ రిపోర్ట్ ను ఏసీబీ కోర్టుకు అందించింది. అప్లికేషన్లలో తప్పులున్నాయని పేర్కొంటూ భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఏసీబీ పేర్కొంది. లంచంగా విల్లాలు, ప్లాట్లను తీసుకున్నట్టు తెలిపింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో శివ బాలకృష్ణ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు.
శివ బాలకృష్ణ విచారణకు ఏమాత్రం సహకరించలేదని ఏసీబీ పేర్కొంది. 1994లో గ్రూప్1 క్యాడర్లో సర్వీస్లోకి వచ్చిన శివబాలకృష్ణ.. అనంతపురం, గుంటూరు, వైజాగ్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖల్లో కీలక పదవులు చేపట్టారు. 2021 నుంచి 2023 వరకు హెచ్ఎండీఏ డైరెక్టర్గా బాలకృష్ణ విధులు నిర్వహించారు. ఆ సమయం ఆయనకు బాగా కలిసొచ్చింది. భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారు. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగాయని ఏసీబీ తెలిపింది.
50 ప్రాపర్టీస్ కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. 4.9 కోట్లు స్థిరాస్తులు, 8.2 కోట్ల చరాస్థులున్నట్టు తెలిపింది. పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌజ్, సోమాజిగూడ లెజెండ్ తులిప్స్ ప్లాట్, శేరిలింగంపల్లిలో అధితలో ప్లాట్, మల్కాజిగిరి, చేవెళ్లలో ప్లాట్స్ ఉన్నట్టు నిర్ధారించామని చెప్పింది. నాగర్ కర్నూల్లో 12.13 ఎకరాల జాగా, చేవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్, భూములు, ప్లాట్స్ ఉన్నాయని చెప్పింది.
99లక్షల నగదు, నాలుగు కార్లు, గోల్డ్, సిల్వర్, వాచ్లు, ఫోన్స్, గృహోప కరణాలున్నాయని తెలిపింది. రొలెక్స్, రాడో, ఫాసిల్, టిసాట్ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన 120 రిస్ట్ వాచీలు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 32 లక్షలు ఉంటుందని చెప్పింది. ఆపిల్ ఫోన్స్ తోపాటు ట్యాబ్స్ 31 స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.