27-01-2024 RJ
తెలంగాణ
నల్లగొండ, జనవరి 27: యువతలో నైపుణ్యతను పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతీ, యువకుల జీవితాలు, వారి కుటుంబాల్లో స్కిల్ సెంటర్లు ఎంతగానో పనిచేస్తాయని పేర్కొన్నారు.
యువత చెడు వ్యసనాలకు, దురాలవాట్లకు లోనుకాకుండా స్కిల్ సెంటర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకు, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చదువుకున్న యువతీ, యువకులకు మూడు నెలలకు ఒక బ్యాచ్ చొప్పున ప్లంబర్, ఎలక్ట్రిషియన్, కంప్యూటర్ బేసిక్స్, వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు.
నాయకులకు రాజకీయాలు శాశ్వతం కాదని, చేసిన మంచి పనులే పదికాలాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.