27-01-2024 RJ
సినీ స్క్రీన్
ప్రస్తుతం చాలావరకు హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతున్నారు. పైగా ఈ ప్రాజెక్ట్స్ తెరకెక్కించే క్రమంలో బ్జడెట్ విషయంలో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు. అలాంటి హీరోల్లో సూర్య కూడా ఒకరు. ప్రస్తుతం సూర్య 'కంగువ' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ నటిస్తున్నాడు. ఇప్పటివరకు 'కంగువ' నుంచి విడుదలయిన ప్రతీ గ్లింప్స్, పోస్టర్స్.. సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేశాయి. ఇందులో సూర్య.. మునుపెన్నడూ కనిపించని అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో విలన్ ఎవరో తాజాగా రివీల్ చేశారు మేకర్స్. వివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కంగువ'లో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు సూర్య. ఇక తనను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నట్టు మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. జనవరి 27న బాబీ డియోల్ పుట్టినరోజు కావడంతో 'కంగువ'లో విలన్ తానే అని చెప్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇందులో బాబీ.. ఉధిరన్ అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. హీరో సూర్య కూడా బాబీ డియోల్ కు బర్త్ డే విషెస్ చెప్తూ.. ఈ పోస్టర్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'హ్యాపీ బర్త్ డే బాబీ డియోల్ బ్రదర్. మీ ఫ్రెండ్షిప్ కు థాంక్యూ. కంగువలో గొప్ప ఉధిరన్లాగా కనిపించడం కోసం మీ ట్రాన్ఫార్మేషన్ అదిరిపోయింది. ప్రేక్షకులందరూ ఆయన కోసం ఎదురుచూడండి’ అనే క్యాప్షన్ తో లుక్ ను ట్వీట్ చేశాడు సూర్య.