29-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 29: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం అనేక సమస్యలు, సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు దొరకని నేతల నుండి పెరుగుతున్న అసమ్మతితో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సహా వివిధ వర్గాల వారి నుండి నిరసనలు, ఆందోళనలను ఎదుర్కొంటోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను జగన్ పార్టీ 151 గెలుచుకుంది. రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లోనూ 22 సీట్లను కైవసం చేసుకుంది. ఇటువంటి సవాళ్ళతో కూడిన సంక్లిష్ట సమయంలో, ఈసారి మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా పార్టీ కార్యకర్తల్లో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపేందుకు జగన్మోహన్ రెడ్డి 'వై నాట్ 175' అంటూ ఒక నినాదాన్ని తెర మీదకు తెస్తున్నారు.
స్వంత పార్టీలోనూ, బయట పెరుగుతున్న అసమ్మతి ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా వుంటుందో అంచనా వేయడం అంత సులభం కాకపోవచ్చు కానీ అందుకుగల అవకాశాలను తోసిపుచ్చలేం. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇంకో వైపు.. కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలలు భారీ ఎత్తున సభలు నిర్వహిస్తూ రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్, అటు టీడీపీ అదినేత చంద్రబాబు కూడా.. పెద్ద ఎత్తున ఈ సభల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కూడా వేదడిని అందుకున్నాయి. వచ్చే ఎన్నికలకు ఇది నాంది అన్నట్లుగా మూడు పక్షాలు కూడా.. విమర్శలు సంధించుకున్నారు.
విశాఖలో వైసీపీ అధినేత జగన్.. ఎన్నికల శంఖం పూరించారు. 'సిద్ధం' పేరుతో నిర్వహించిన సభలో ఎన్నికలకు తాము సిద్ధయ్యామని స్పష్టం చేశారు. ఇక, రా.. కదలిరా! సభలతో టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంటు స్థాయి నియోజకవర్గాల్లో కొన్నాళ్లుగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా వచ్చే ఎన్నికలకు రెడీ అయిపోయామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని పుంజుకునేలా చేసేందుకు వైఎస్ షర్మిల చేపట్టిన యాత్రలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఆయా సభలు, యాత్రల్లో ఒకరిపై ఒకరు విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఒకరు రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని అంటే.. మరొకరు.. రాష్ట్రానికి ఉన్న శకుని వదిలిపోతాడని మాటల తూటాలు పేల్చుకున్నారు.
అటు వైపు మాటల తూటాలు పేలితే.. ఇటు వైపు అంతకుమించిన బాంబులే పేలాయి. ఇలా.. ఇరు పక్షాల మధ్య పోటా పోటీ వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. షర్మిల ఏకంగా.. అన్న సీఎం జగన్ పైనా, అధికార పార్టీపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా ప్రచార హోరు హోరెత్తిపోతోంది. బిజెపి నుంచి ప్రచారంలోకి మోడీ, అమిత్ షాలు కూడా త్వరలోనే అడుగు పెట్టనున్నారు. అదేసమయంలో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కూడా జోరు పెంచుతున్నారు.
టీడీపీ నుంచి నారా ఫ్యామిలీ, నారా లోకేష్, బ్రాహ్మణి, బాలయ్య.. వంటివారు దిగిపోనున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరింత మంది ప్రచారం చేయనున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ సహా కమ్యూనిస్టులు కూడా అరంగేట్రం చేయనున్నారు. మొత్తంగా ఎన్నికల వేడితో ఎపి రాజుకుంటోంది.