29-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 29: తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. ఉద్యోగాల కల్పన నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కవిత చెబుతున్నారు.. ఇఎక్కడ ఇచ్చారో మరి ఆ లెక్క చెప్పాలని డిమాండ్ చేసింది. ఈడీ నోటీసులు వచ్చిన ప్రతిసారి కవిత ఢిల్లీ వెళ్లి టెంట్ వేస్తారని ఆరోపించింది. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయని పనులను 100 రోజుల్లో తమ పార్టీ చేయనుందని స్పష్టం చేసింది.
గత ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. తాము డెవలప్ చేస్తే తట్టుకోలేక పోతుందని మండిపడింది. గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు భవాని రెడ్డి, సునీతా పాల్, జ్ఞాన సుందర్ మీడియాతో మాట్లాడారు. కెమెరాలు పెట్టుకొని, కార్మిక సంఘ ఆటోల్లో తిరుగతూ కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పీపుల్స్ అని, ప్రజల కోసం ఆలోచిస్తున్నారని సునీతా పాల్ అన్నారు. కేటీఆర్ మాత్రం ప్రజలని వాడుకుంటూ డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 50 రోజులు కాలేదన్నారు.
కేటీఆర్ ప్రజల్లో తిరిగితే పదేళ్లలో ఏం చేశారని ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేస్తోందని విమర్శించారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నేతలు మతిస్థిమితం కోల్పోయారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ యాత్ర బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకంగా సాగుతోందని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్ఞాన సుందర్ వివరించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్నడూ ఒక్కటి కాలేవన్నారు. తాము అవగాహనతో ఉంటే తమ పార్టీ నాయకులపై ఈడీ కేసులు ఎందుకు అవుతాయని నిలదీశారు. వాళ్ళకు అవగాహన ఉన్నందునే లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాలేదని చెప్పారు.