29-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 29: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కానీ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారని అన్నారు. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. సోమవారం నాడు బాగ్ లింగం పల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు వాజీ హుస్సేన్, కల్పన యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.... విద్య, వైద్యాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ఆస్తులు, సంపద సృష్టిస్తే బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ కోసం ప్రతి కార్యకర్త కష్ట పడతారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం చరిత్రాత్మక నియోజకవర్గమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం గర్వకారణమని చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చెసింది ఆనాటి కాంగ్రెస్ నాయకులేనని అన్నారు.
కృష్ణ, గోదావరి నుంచి నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ నే అని తెలిపారు. బీఆర్ఎస్ హైదరాబాద్ కు చుక్క నీళ్లు తెలేదని విమర్శించారు. చదువుకోవడానికి కళాశాలలు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ ను కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. హైటెక్ సిటీ కంప్యూటర్ రంగాన్ని మొదట కాంగ్రెస్ తెచ్చిందని గుర్తుచేశారు. ఇక్కడ పరిశ్రమలు రావడానికి కారణం ఆనాటి కాంగ్రెస్ నాయకులేనని భట్టి విక్రమార్క తెలిపారు.