29-01-2024 RJ
సినీ స్క్రీన్
మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా బాగా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ కెరీర్ ఒక్క అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనుకకు అన్నట్లుగా ఉంది. 2023లో తెలుగులో దసరా, భోళా శంకర్ రెండు సినిమాలు, తమిళంలో మామన్నన్ అనే మూడు సినిమాలు చేయగా ఈ యేడు తెలుగులో ఇప్పటికీ ఒక్క సినిమా కూడా సంతకం చేయకపోవడం గమనార్హం. గర్ల్ నెక్స్ట్ డోర్ వంటి క్యారెక్టర్లతో మొదలు పెట్టి నిత్యం వైవిధ్యభరిత పాత్రలను చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది.
ఇప్పటికే తేరి అనే తమిళ సినిమా బాలీవుడ్ రిమేక్ బేబీ జాన్లో వరుణ్ దావన్తో కలిసి నటిస్తుండగా, ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. అదే విధంగా తమిళంలో రఘు తాత, రివాల్వర్ రిటా, సైరెన్, కన్నివేడి వంటి నాలుగు చిత్రాలలో నటిస్తోంది కీర్తి సురేష్ . ఇప్పటివరకు సౌత్ ఇండియా అన్ని ఇండస్ట్రీలలోను మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ నటికి ఫ్యాన్ బేస్ భారీగానే ఉండగా సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్ ఉంటుంది. అయితే ఈ ఫ్యాన్స్ విషయంలోనే తాజాగా ఓ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతున్నది. విషయానికి వస్తే.. కృష్ణ అనే ఓ వీరాభిమాని కీర్తికి డైహర్డ్ ఫ్యాన్.
ఈ క్రమంలో కీర్తికి సోషల్ మిడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో ఇప్పటివరకు 233 లేఖలు రాయడమే కాకుండా వాటికి రిప్లై ఇవ్వాలని చాలాసార్లు కోరాడు. చివరకు 234వ లెటర్ కు స్పందించిన కీర్తి ఇంత ఆలస్యంగా సమాధానం ఇచ్చినందుకు క్షమాపణలు కోరింది. మీలాంటి అభిమాని నాకు లభించడం నా అదృష్టం అని, ఆ నెంబర్ నాకు ఫాంటసీ నెంబర్ అని చెప్పి తన అభిమానిని ఖుషీ చేసింది. సడన్ గా కీర్తి ఓ ఫ్యాన్ కామెంట్స్ ను చదివి సమాధానం ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతూ ఆమె ట్వీట్ను రీ ట్వీట్ చేస్తున్నారు.