30-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 30: రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార వైసీపీ జోరు పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న ఈ సదస్సుల్లో భాగంగా వైసీపీ కేడర్ కు సీఎం దిశా, నిర్దేశర చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి విజయం ఎంత ముఖ్యమే కేడర్ కు సీఎం జగన్ తెలియజేస్తున్నారు.
గడిచిన ఐదేళ్లలో ప్రజలకు చేసిన లబ్దిని వివరించాలని సూచిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కేడర్ కు దిశా, నిర్దేశం చేసే సభగానే వీటిని నిర్వహిస్తున్నారు. సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న సభలు విజయవంతమైతే.. ప్రజలలో భారీ ఎత్తున సభలు నిర్వహించాలని వైసీపీ అధినాయకత్వం సన్నాహాలు చేస్తోంది.
భీమిలిలో తొలి ఎన్నికల శంఖారావ సభను నిర్వహించిన అధికార పార్టీ.. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సభలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. భీమిలి సభ విజయవంతం కావడంతో మిగిలిన చోట్ల కూడా వరుస సభలు నిర్వహించేందుకు అనుగుణంగా వైసీపీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మూడో తేదీన ఏలూరులో సిద్ధం పేరుతో మరో సభను ఏర్పాటు చేయబోతోంది. ఈ సభను కూడా సుమారు మూడు లక్షల మందితో నిర్వహించనున్నట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ సభకు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నిర్వహించనున్నారు.
ఈ మేరకు వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, ఆళ్ల నానీ, ఇతర నాయకులు సభకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించి ముఖ్య నాయకులకు దిశా, నిర్ధేశర చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాకు సంబంధించి ఏలూరులో నిర్వహిస్తున్న సభకు కేడర్ ను భారీగా తీసుకువచ్చేలా ఆ పార్టీ ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో పని చేసే నాయకులు, కార్యకర్తలకు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల మార్పులతోపాటు పలు సర్వేలు నిర్వహిస్తోంది. గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తోంది. మరోవైపు జోన్లు వారీగా ఉన్న పార్టీ ఇన్చార్జిలు, ముఖ్య నాయకులతో సమీక్షలను సీఎం నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు పెండింగ్ లో ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిని వేగవంతం చేస్తున్నారు.
టార్గెట్ 175 దిశగా వైపుగా వైసీపీ వెళుతోంది. ఇందుకోసం అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థలను మార్చేస్తున్నారు. కొత్తవారిని తెరపైకి తెస్తున్నారు. కొందరికి టిక్కెట్లు నిరాకరిస్తున్నారు. కొందరిని ఎంపిలుగా నిలబెడుతున్నారు. ఈ క్రమంలో కొందరు పార్టీని వీడి వెళుతున్నా పట్టించుకోవడం లేదు.