30-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జనవరి 30: టాలీవుడ్ ని పట్టి పీడిస్తున్న 'డ్రగ్స్ దందా'ను నిర్మూలించాలని అధికారులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా.. చాపకింద నీరులా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో కొందరు ఈ దందాని అత్యంత రహస్యంగా నడుపుతున్నారని ఇదివరకే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అందుకే.. అధికారులు ఇండస్ట్రీ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే.. నార్సింగిలో ఇద్దరు నిందితులను తాజాగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
వీరిలో ఒకరు లావణ్య అనే విద్యార్థిని కాగా, మరొకరు ఉనీత్ రెడ్డి. సదరు యువతి లావణ్య.. ఒక హీరో ప్రియురాలు అని తేలింది. రిమాండ్ రిపోర్టులోని అంశాల ఆధారంగా.. విజయవాడ నుంచి ఉన్నత చదువులు కోసం లావణ్య హైదరాబాదు వచ్చింది. జల్సాలకు అలవాటు పడిపోయి టాలీవుడ్ లో ఛాన్స్ కోసం లావణ్య ప్రయత్నించింది. మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తూ చిన్న సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్టుగా లావణ్య నటించింది.
కొన్ని షార్ట్ ఫిలింస్ లో హీరోయిన్ గా సైతం నటించింది. ఆ సమయంలోనే ఆమె జల్సాలకు అలవాటు పడింది. ఒక హీరోతో లవ్ అక్టెర్ కూడా నడుపుతోంది. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో అనుమానితురాలుగా ఉన్న లావణ్య .. గత కొంత కాలంగా ఉనిత్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
లావణ్య సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత చాట్ ని సైతం పోలీసులు పరిశీలించనున్నారు. చాలామంది వీఐపీలతో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లావణ్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.