30-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 30: జనసేన, టిడిపిల మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే సర్దుబాటు కానుందని తెలుస్తోంది. అలాగే రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల 4 నుంచి మిగిలిపోయిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో రా కదలిరా సభలు పెట్టనున్నారు. ఫిబ్రవరి 4న అనకాపల్లి నుంచి పవన్ కల్యాణ్ పర్యటనలు ప్రారంభించే అవకాశం ఉంది. ఉమ్మడిగా రాష్ట్రస్థాయి సభల్ని నిర్వహించాలని పవన్, చంద్రబాబు భావిస్తున్నారు. వీటిపైన ఫిబ్రవరి మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో చివరిదశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే రెండు పార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కూడా రెండుసార్లు సమావేశం అయ్యారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి.. ఏయే సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ప్రాథమికంగా వారు ఓ అవగాహనకు వచ్చినట్లగా తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున మొదటి వారంలో సీట్ల సర్దుబాటు ప్రకటన చేస్తే.. తర్వాత అనంతృప్తుల్ని బుజ్జగించవచ్చని అనుకుంటున్నారు.
ఎన్నికల సమయానికి కూటమి స్మూత్ గా పోలింగ్ కు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలని అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల రెండు సీట్లు తమ పార్టీ తరపున పోటీ చేస్తున్నామని ప్రకటించారు. అందులో ఒకటి రాజోలు, రెండోది రాజానగరం. అంతకు ముందు చంద్రబాబునాయుడు ప్రచార సభల్లో మండపేట, అరకులనుంచి అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇది జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలకు కారణం అయింది. పొత్తులో ఉండి ఇలా ఏకపక్షంగా సీట్లు కేటాయించుకుని అభ్యర్థుల్ని ప్రకటించుకోవడం ఏమిటని పార్టీ క్యాడర్ అనంతృప్తి వ్యక్తం చేయడంతో పవన్ సర్ది చెప్పారు.
తాను కూడా రెండు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. తర్వాత నాగేంద్ర బాబు చర్య, ప్రతి చర్య అంటూ పోస్టింగ్ పెట్టడం కూడా వివాదాస్పదమయింది. చివరికి అవి పెరగకుండా చూసుకోవా లని రెండు పార్టీల నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిజానికి టీడీపీ, జనసేన ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చాయని.. అంతర్గతంగా ఏ ఏ సీట్లు అన్నది కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు. అభ్యర్థుల అంశంపైనా ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నారు. అయితే బీజేపీతో జనసేన పార్టీ చర్చలు జరుపుతోంది. తాము, జనసేన పార్టీ పొత్తులో ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో అధికారికంగా పొత్తుల ప్రకటన చేయడంలో ఆలస్యం అవుతుంది. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని.. ప్రచారం జరుగుతోంది. వెళ్లినా వెల్లకపోయినా.. ఫిబ్రవరి మొదటి వారంలో పొత్తుల ప్రకటన, సీట్ల సర్దుబాటు అంశాలపై రెండు పార్టీలు ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు, పవన్ మరోసారి సీట్ల అంశంపై చర్చించేందుకు భేటీ కానున్నారు.